మలయాళ మాంత్రికులు!

ప్రేక్షకులు వినోదం కోసం, నిర్మాతలు రీమేక్‌ హక్కుల కోసం, ఫిల్మ్‌స్కూల్‌ విద్యార్థులు కేస్‌స్టడీ కోసం, రచయితలు వినూత్నమైన ఐడియాల కోసం.. కొత్త మలయాళ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తుంటారు.

Updated : 21 Apr 2024 16:11 IST

ప్రేక్షకులు వినోదం కోసం, నిర్మాతలు రీమేక్‌ హక్కుల కోసం, ఫిల్మ్‌స్కూల్‌ విద్యార్థులు కేస్‌స్టడీ కోసం, రచయితలు వినూత్నమైన ఐడియాల కోసం.. కొత్త మలయాళ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తుంటారు. కథలో కొత్తదనం, కథనంలో వైవిధ్యం, సంభాషణల్లో సహజత్వంతో.. భారతీయ సినిమా పరిశ్రమకు సరికొత్త ఫిల్మ్‌ మేకింగ్‌ పాఠాలు నేర్పుతోంది మాలీవుడ్‌. ఈసారి ఏ ఎయిర్‌పోర్ట్‌లోనో ఫహాద్‌ ఫాజిల్‌ కనుక కనిపిస్తే ‘పార్టీ ఎప్పుడు చేటా?’ అని అడగాల్సిందే.

భారీ బడ్జెట్‌లు ఉండవు. ఖరీదైన సెట్టింగులు.. కనిపించవు. పంచ్‌ డైలాగులు.. వినిపించవు. గ్రాఫిక్‌ మాయలు.. గారడి చేయవు. అయితేనేం. కథకు ఆత్మ ఉంటుంది. పాత్రల్లో జీవకళ తొంగిచూస్తుంది. సంభాషణల్లో సహజత్వం తొణికిసలాడుతుంది. ఆలూమగలు మాట్లాడుకున్నట్టూ, ప్రేమికులు ఊసులు చెప్పుకున్నట్టూ, ఇరుగుపొరుగు ముచ్చట్లు పెట్టుకున్నట్టూ అతి సహజంగా సాగి పోతాయి. కాకపోతే, కథ వేగం అందు కోడానికి కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు అసలు కథంటూ ఉందా అనే అనుమానమూ కలుగుతుంది. టాలీవుడ్‌ డబుల్‌ మసాలా బిర్యానీ ఘాటు అలవాటైన ప్రాణాలకు.. రవ్వ ఉప్మా వడ్డించిప్పుడు కలిగే అసంతృప్తి లాంటిదేదో ప్రేక్షకుడిలో తొంగిచూస్తుంది. అదీ రవ్వంతసేపే. మెల్లగా ఉద్వేగాలు రాజుకుంటాయి. సిద్ధాంతాలు సంఘర్షిస్తాయి. ఎక్కడా నటులు కనిపించరు. అన్నీ పాత్రలే. ఎవరూ నటించరు. పరిపూర్ణంగా జీవిస్తారు. కాబట్టే, మలయాళ చిత్రాలు తెలుగు సినిమాల పోటీని తట్టుకుని మరీ థియేటర్లలో ఆడుతున్నాయి. ఓటీటీలో క్లిక్కుల కలెక్షన్లు కురిపిస్తున్నాయి.

బడ్జెట్‌ తక్కువే..

మాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ చిత్రాలు తక్కువే. ఫారిన్‌ లొకేషన్లూ, ఖరీదైన సెట్టింగులూ పెద్దగా కనిపించవు. చాలా సినిమాలు ఓ పల్లె చుట్టుపక్కలో, ఓ ఇంటి పరిసరాల్లోనో తిరుగుతాయి. జీరో సైజ్‌ హీరోయిన్లూ, సిక్స్‌ప్యాక్‌ హీరోలూ వాళ్ల కాస్టింగ్‌ లిస్ట్‌లో ఉండరు. కాస్టూమ్స్‌ ఖర్చూ నామమాత్రమే. పురుషులైతే లుంగీలదే హంగామా. స్త్రీ పాత్రలకు నైటీలతోనే తెల్లారిపోతుంది. పాడుబడిన బంగళాలో పద్దెనిమిదో శతాబ్దపు వాతావరణంలో, మూడునాలుగు పాత్రలతో నిర్మించిన మమ్ముట్టి నలుపు తెలుపు సినిమా ‘భ్రమయుగం’ వందకోట్ల క్లబ్‌లో చేరింది. ప్రమాదంలో చిక్కుకున్న మిత్రుడి కోసం ఓ స్నేహబృందం పడిన తపన ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ పేరుతో రెండొందల కోట్ల వసూళ్లు సాధించింది.

మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌ లవ్‌స్టోరీ ‘ప్రేమలు’ నూటయాభై కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సినిమా కోసం హైదరాబాదీ నేపథ్యాన్ని తీసుకోవడం, అక్కడక్కడా అప్పుడప్పుడూ తెలుగు డైలాగులు చెప్పించడం.. టాలీవుడ్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకునే వ్యూహం కావచ్చు. గత ఏడాది బ్లాక్‌బస్టర్‌ ‘2018’ నూట డెబ్భై అయిదు కోట్లు కొల్లగొట్టడమే కాదు.. ఆస్కార్‌కూ షార్ట్‌లిస్ట్‌ అయ్యింది.  ‘ప్యారడైజ్‌’ అనే సినిమా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో కూడా ఆడింది. ‘దృశ్యం 2’ హాలీవుడ్‌ చిత్రంగా రాబోతోంది. ఓ భారతీయ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో రీమేక్‌ చేయడం ఇదే తొలిసారి. ఒక్క మలయాళ పరిశ్రమకే ఈ గౌరవం దక్కింది. అలా అని అక్కడ ఫెయిల్యూర్సే లేవని కాదు. ఆ పరిశ్రమకు గట్టి దెబ్బలే తగిలాయి. ‘నేను బాక్సాఫీస్‌ లెక్కలు మాట్లాడను. ఒకటి మాత్రం నిజం. మలయాళ సినిమాల గురించి జనం చర్చించుకుంటున్నారు. కొత్త బొమ్మ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అంతకంటే ఏం కావాలి?’ అంటారు పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌. పృథ్వీది బహుముఖ ప్రజ్ఞ. తను నటుడు, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారు, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌. అన్నిటికీ మించి సినిమా ప్రేమికుడు. తొలి రోజుల్లో చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడ్డారు. వీక్షకుల నాడి పట్టేసుకున్నాక.. వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఈ మధ్య ఏదో మూవీ ప్రమోషన్‌ కోసం పృథ్వీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు.. జనం అతనికి బ్రహ్మరథం పట్టారు. టాలీవుడ్‌ స్టార్స్‌ను తలపించేలా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. తనే కాదు.. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, దుల్కర్‌ సల్మాన్‌.. ఇలా మనకు బాగా తెలిసిన మలయాళ నటులు చాలామందే ఉన్నారు. ఈ ముగ్గురూ అయితే నేరుగా తెలుగు సినిమాల్లోనూ నటించారు. ‘స్వాతి కిరణం’లో మమ్ముట్టి నటననూ, ‘జనతా గ్యారేజ్‌’లో మోహన్‌లాల్‌ పాత్రనూ మరిచిపోగలమా?. ‘సీతారామం’ తర్వాత దుల్కర్‌ తెలుగింటి రాముడైపోలేదూ!

కథల కార్ఖానా

హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రతి పరిశ్రమనూ కథల కొరత వేధిస్తూనే ఉంటుంది. ఎవరి పద్ధతిలోవారు స్టోరీలను వండివార్చుకుంటారు. ఈ విషయంలో మాలీవుడ్‌కు ట్రేడ్‌మార్క్‌ ఫార్ములా ఉంది. తనకంటూ ఓ నియమం పెట్టుకుంది. ఇక్కడ ఫారిన్‌ సరకును రీసైకిల్‌ చేయరు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల సీన్లు చించేసి వాడుకోరు. ప్రతికథకూ జీవితమే నేపథ్యం. ప్రతిపాత్రా జనంలోంచి పుడుతుంది. నిజానికి మనకు కథల కొరత లేదు. ఉన్నదంతా ఆలోచనల కొరతే.. అనిపిస్తుంది మలయాళ సినిమాలు చూస్తున్నప్పుడు.

సురేశ్‌ గోపి హీరోగా వచ్చిన ‘గరుడన్‌’ ఓ వినూత్న ప్రయోగం. సగం సినిమా ఒక కోణంలో సాగుతుంది. ఒక పాత్రను ద్వేషిస్తాం. మరో సగం ఇంకో కోణంలో నడుస్తుంది. అదే పాత్రను ప్రేమిస్తాం. ప్రేక్షకుల ఎమోషన్స్‌తో ఆడుకోవడం మలయాళ దర్శకులకు బాగా తెలుసు. ‘గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’.. వంటింట్లో నలిగిపోతున్న ఓ యువతి హృదయాన్ని ఆవిష్కరించింది. మలిసంధ్యలో ఒంటరి జీవితం గడుపుతున్న ఓ తండ్రి, తన కొడుకు రూపొందించిన రోబోతో అనుబంధాన్ని ఎలా పెంచుకుంటాడో ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’లో చూస్తాం. టొవినో థామస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర పోషించిన ‘అన్వేెషిప్పిన్‌ కండెెతుమ్‌’ నేర పరిశోధన చుట్టూ సాగే సినిమా. ఒక చిన్న క్లూ పెద్ద మిస్టరీని ఛేదిస్తుంది. ‘అంధురాలైన ఓ శిల్పకారిణి తనపై జరిగిన అఘాయిత్యాన్ని కోర్టుకు ఎలా వివరిస్తుంది?’ అనే కోణంలో సాగే ‘నేరు’ మోహన్‌లాల్‌ నటనా వైదుష్యానికి అద్దంపట్టే సినిమా. ‘ఆట్టం’ నాటకం చుట్టూ తిరిగే జీవితం కథ. పదకొండుమంది అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్న నాటక బృందంలో.. ఒకానొక అర్ధరాత్రి జరిగిన సంఘటన కథను మలుపు తిప్పుతుంది. ‘ఆ చీకటి వేళ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించింది ఎవరు?’ అనే కోణంలో సాగే పంచాయతీ పురుషా హంకారాన్ని బట్ట బయలు చేస్తుంది. ఇలాంటి సినిమాలు మలయాళంలో తప్పించి ఎక్కడా తీయరు,  తీయలేరు కూడా. ఈ  ప్రయోగాల వెనుక నితీశ్‌ సహదేవ్‌, ఆనంద్‌ ఏకర్షి, శ్రుతి శరణ్యం, జోయ్‌ బాబీ, లిజో జోస్‌ పెల్లిసేర్రి తదితర ప్రతిభావంతులైన దర్శకులు ఎంతోమంది. ‘గోట్‌ లైఫ్‌’ మాలీవుడ్‌ తాజా సంచలనం. దాదాపు పదహారేళ్ల కాలం ఈ చిత్రం కోసమే పనిచేశారు దర్శకుడు బ్లెస్సీ. ఎంత ఒత్తిడి వచ్చినా సరే, ఇంకో ప్రాజెక్ట్‌ తీసుకోలేదు. ఆ కృషి ఫలించింది.

‘గోట్‌ లైఫ్‌’ సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ‘ఆడు జీవితం’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ యువకుడు ఎడారిలో చిక్కుకు పోతాడు. ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. అక్కడి నుంచి ఎలా బయటపడతాడు అనేదే ఇతివృత్తం. హాలీవుడ్‌ స్థాయికి తగ్గకుండా తెరకెక్కించారు దర్శకుడు. ‘ఇదంతా ఆరంభమే. మలయాళ సినిమా సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఎంచుకోవాల్సిన జీవన కోణాలు ఇంకా మిగిలే ఉన్నాయి’ అంటారు బ్లెస్సీ. ‘గత పదేళ్లలో ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉన్న కథలనే ఇష్టపడు తున్నారు. ప్రస్తుతం మలయాళ పరిశ్రమ ఆ ట్రెండ్‌ను కొనసాగిస్తోంది’ అని విశ్లేషిస్తారు ‘కాదల్‌-ది కోర్‌’ సహ రచయిత ఆదర్శ్‌ సుకుమారన్‌.

  

ముందు నుంచీ..

మలయాళ ప్రేక్షకులకు ప్రయోగాత్మక చిత్రాలు కొత్తేం కాదు. కమర్షియల్‌ మూవీస్‌ హవా కొనసాగుతున్న సమయంలోనే అక్కడ ప్రత్యామ్నాయ సినిమా ఉనికిని చాటుకుంది. ఆడూర్‌ గోపాలకృష్ణన్‌, జి.అరవిందన్‌, భరతన్‌ తదితర దర్శకులు వైవిధ్యానికి పునాదులు వేశారు. ఆ ప్రయోగాల్ని ప్రేక్షకులూ ఆదరించారు. ఆ ధైర్యంతోనే కమర్షియల్‌ దర్శకులు కూడా ప్రయో గాలకు సిద్ధపడ్డారు. వినూత్నమైన ఇతివృత్తాలు ఎంచుకున్నారు. సరికొత్త పాత్రలు సృష్టించారు. ఓటీటీలు వచ్చాక.. మొత్తంగా సినిమా పరిధి పెరిగింది. ప్రత్యేకించి మలయాళ తెర మరింత విస్తరించింది. భాష ఓ అవరోధమే కాదిప్పుడు. ప్రతి బొమ్మనూ నాలుగైదు ప్రాంతీయ భాషల్లో డబ్‌ చేస్తున్నారు. చేయకపోయినా సబ్‌ టైటిల్స్‌ ఉండనే ఉన్నాయి. ఇదే సందర్భంలో మలయాళ ప్రేక్షకుల ఉత్తమాభిరుచినీ ప్రస్తావిం చాల్సిందే. సినిమాను జడ్జ్‌ చేస్తున్నప్పుడు వాళ్లు మహా కచ్చితంగా ఉంటారు. ఎక్కడా రాజీపడరు. దీంతో దర్శకులు సైతం ఒళ్లు దగ్గర పెట్టుకుని తీస్తున్నారు. ఆ జిగి, బిగి కారణంగానే పాన్‌ ఇండియా జనాలకూ నచ్చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ప్రేమమ్‌’ సినిమా మాలీవుడ్‌కు ఓ కొత్త మలుపు. భారతీయ యువతరాన్ని మలయాళ సినిమాలవైపు లాగేసిన మాయా జాలమిది. అంతకు కాస్త ముందే వచ్చిన ‘బెంగళూరు డేస్‌’ పరిశ్రమకు మల్టీవిటమిన్‌ డోసేజ్‌. మలయాళ ఇండస్ట్రీ సినిమాను సమష్టి బాధ్యతగా భావిస్తుంది. అందుకే.. టైటిల్స్‌లో ‘థ్యాంక్స్‌..’ శీర్షిక కింద కనీసం పాతిక పేర్లయినా కనిపిస్తాయి.

బడ్జెట్‌ ఫ్రెండ్లీ

పెద్ద చిత్రాల విషయానికొస్తే తెలుగు పరిశ్రమలో హీరోల పారితోషికమే పావువంతు ఉంటుంది. అదనంగా పంపిణీ హక్కులు అడుగుతారు. మలయాళ సీమలో ఆ బాధ ఉండదు. సూపర్‌స్టార్ల రెమ్యునరేషన్లు చిన్న నిర్మాతలకూ అందుబాటులో ఉంటాయి. దీంతో నిర్మాణ ఖర్చులు అదుపు తప్పవు. అదే సమయంలో రచయితలకు ఏమాత్రం తక్కువ చేయరు. ఫలితంగా నాణ్యమైన స్క్రిప్ట్స్‌ వస్తున్నాయి. కథ, కథనం, స్క్రీన్‌ ప్లే, పరిశోధన.. ఇలా దర్శకుడే సకల బాధ్యతలనూ తీసుకోవాలని అనుకోడు. కథ అల్లేవాడు కథ మీదే దృష్టి పెడతాడు. దర్శకుడి పని దర్శకుడిదే. అన్నిటికీ మించి హీరోలు ఇమేజ్‌ చట్రంలో చిక్కుకుపోరు. కాబట్టే, మమ్ముట్టి స్వలింగ సంపర్కుడి పాత్ర పోషించగలిగారు. ఫహాద్‌ ఫాజిల్‌ సైకో పాత్రలకు ఒప్పుకున్నారు.

*  *  *

ఏదైనా మంచి సినిమా చూసి ఇంటికెళ్తున్నప్పుడు.. ఏదో ఓ ఉద్వేగాన్ని మోసుకెళ్తాం. అదే మలయాళ సినిమా చూసిన తర్వాత.. కేరళ టూర్‌ నుంచి తిరిగొస్తున్న భావన కలుగుతుంది. కారణం.. ఆ చిత్రాల్లో సంస్కృతి అంతర్లీనం. సంప్రదాయం ఓ భాగం. ప్రతి ఫ్రేమ్‌లో పల్లె అందాలనూ పచ్చదనాలనూ దర్శించుకుంటాం. గాడ్స్‌ ఓన్‌ కంట్రీ.. సినిమాస్‌ ఓన్‌ కంట్రీ కూడా!


కొంత అసూయ...

లయాళంలో మంచి మంచి నటులు ఉన్నారని చెప్పడానికి నాకు కొంత అసూయగా ఉంది. నేను యాక్షన్‌ సీన్స్‌తో సాధించే చప్పట్లు.. మలయాళంలో చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తో సొంతం చేసుకుంటున్నారు. అక్కడ ప్రతి పాత్రనూ శ్రద్ధగా తీర్చిదిద్దుతారు. మా కార్తికేయ ‘ప్రేమలు’ అనే మలయాళ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా మారినందుకు సంతోషిస్తున్నా..

రాజమౌళి, దర్శకుడు


మల్లు అర్జున్‌

నకు మలయాళ వంటకం అవియల్‌ తెగ నచ్చుతోంది. వాళ్లేమో మన దమ్‌ బిర్యానీ మీద మనసు పడుతున్నారు. తెలుగువాళ్లు మలయాళ క్లాసిక్స్‌ను ఆకాశానికెత్తేస్తుంటే.. కేరళ సినిమా అభిమానులు అల్లు అర్జున్‌ గ్లామర్‌ సినిమాలంటే పడిచస్తున్నారు. ‘ఆర్య’తో మొదలైన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. బన్నీ డ్యాన్సులకైతే.. ఈలలూ చప్పట్లే. హ్యాపీ, బద్రీనాథ్‌.. ఒకటేమిటి, ప్రతి సినిమా ప్రత్యేకమే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలోని ‘అలవైకుంఠ పురములో’ అక్కడ ‘అంగు వైకుంఠపురత్తు’ పేరుతో విడుదలైంది. ఓ టీవీ చానల్‌లో ఆ సినిమా ప్రసార మైనప్పుడు.. రికార్డు స్థాయి టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చింది. మలయాళ అభిమానులంటే బన్నీకి ప్రత్యేకమైన ఇష్టం. కేరళ వరదల సమయంలో తనవంతు సాయం అందించారు. నేనున్నాననే ధైర్యం ఇచ్చారు.


తెలుగు మలయాళం

వెనక్కి తిరిగి చూసుకుంటే.. హిట్‌టాక్‌ తెచ్చుకున్న చాలా తెలుగు చిత్రాలకు మూలం.. మలయాళ సినిమాలే. ఫలక్‌నుమా దాస్‌, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, భీమ్లా నాయక్‌, గాడ్‌ఫాదర్‌, దృశ్యం...ఈ చిట్టా చాలా పెద్దదే. కాకపోతే, కొన్ని సందర్భాల్లో మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన సినిమాలు తెలుగులో ఒకటిరెండు వారాలు కూడా నిలబడటం లేదు. అలా అని మాతృకను తప్పుపట్టలేం. ఆయా చిత్రాల ఆత్మను పట్టుకోవడంలో మనమే విఫలం అవుతున్నామేమో.. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ చొప్పించబోయి చేతులు కాల్చుకుంటున్నామేమో.. యాక్షన్‌ సీన్లూ, సుదీర్ఘమైన డైలాగులూ బలవంతంగా అతికిస్తున్నామేమో.


కేరళ కాంతలు

మాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అవుతున్న కథానాయికలు చాలామందే ఉన్నారు. ఆ అందాల భరిణెలను మన ప్రేక్షకులు ఇష్టంగా ఆమోదిస్తున్నారు. నిత్యా మీనన్‌, నయనతార, సమంత, అమలాపాల్‌, అనుపమ పరమేశ్వరన్‌, కీర్తి సురేశ్‌, మంజు వారియర్‌.. ఒకరా, ఇద్దరా అక్కడ పుట్టి ఇక్కడ వెలిగిపోతున్న కేరళ కుట్టెమ్మల జాబితా చాంతాడంత. తెలుగు పరిశ్రమకు నాయికలను అందించే కార్ఖానాలా మారింది మాలీవుడ్‌. అలా మనం వారికి రుణపడి ఉన్నాం.

మలయాళ బ్యూటీస్‌ తెరపై క్యూట్‌నెస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..